Monday, April 8, 2024

మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!


ఫిలిం మేకర్‌ సత్య తేజ్‌ ‘గంగరాజం బిడ్డ’ పుస్తకం మీద తన అభిప్రాయాన్ని ఏప్రిల్‌ 1, 2024న ఎఫ్బీలో పోస్ట్‌ చేశారు. అదే ఇక్కడ పంచుకుంటున్న.

 ----------------------------------------------------------------- 


మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!

"మొత్తం సృష్టి విన్యాసాన్ని వ్యాఖ్యానించడానికి నువ్విక్కడ లేవు, సరిపోవు."
మొట్టమొదటగా నా కళ్లని కట్టిపడేసిన ఈ మాటలు రాజిరెడ్డి గారి 'గంగరాజం బిడ్డ' కథల పుస్తకం బ్యాక్ కవర్ పేజ్ మీద అడ్డంగా ఎంతో అందంగా విష్ణుమూర్తి లా పడుకొని నన్ను ఆ ప్రపంచంలోకి రమ్మని ఎంతో సాదరంగా ఆహ్వానించాయి.
వెళ్ళాను. చదివాను. కొన్ని ఎంతో నచ్చాయి, కొన్ని అసలే నచ్చలేవు. కానీ ఏ అరక్షణమో కూడా పుస్తకాన్ని పక్కన పెట్టేద్దామని తలపించిందే లేదు. అంతలా తన రాతలు, subtleties and montonous lives లో నుండి తను పుట్టించే కవిత్వ పూరిత వచనం నన్ను కట్టిపడేసిందనే చెప్పాలి తప్పకుండా. Little things are never little అని మా చెల్లి నాతో ఎప్పుడూ చెపుతూ ఉంటుంది. ఇంతటి littlest of the little things ని ఒక్క మనిషి తాలూక observation లో బంధింపబడి, ఎంతో అందంగానూ, అబ్బురపోయే విధంగాను తను సృజించే కథలు భళే తమాషాగా మనకే జరుగుతున్నట్లుగా, మనమే ఆ vantage point నుండి చూస్తున్నట్లుగా, అవేం అతీంద్రియ శక్తులకే పరిమితమయ్యే విషయాలు కావన్నట్టు, చూడగలిగితే ఓ బోర్లించిన చెప్పు వెనకాల కూడా మనసుని కకావికలం చేసే కథని పుట్టించవచ్చని 'బోర్లించిన చెప్పు' చదివితే ఇట్టే అర్థమయిపోద్ది రాజి రెడ్డి శక్తి.. ఆయన రచనా సృష్టి!
మస్తు రాసినారు బ్రదర్ అదయితే.
నాకు ఎక్కువగా నచ్చిన కథలు గంగరాజం బిడ్డ,
మెడిటేషన్, చిన్న సమస్య & ఎఱుక.
గంగరాజం బిడ్డ లో పూర్ణలతని, ఆ అబ్బాయిని ఎన్నటికీ మరిచిపోలేను నేను. ఎంతో హృద్యంగా, విషాదంతో కూడుకొని రాసారు ప్రతీదీ. ఈ కథలో ఉన్న ambience, atmospherics ని ఆ అబ్బాయి emotional landscape లో తన మనసు తాలూక నిర్దిష్టమైన లోకంలో కొట్టుమిట్టలాడుతున్న details తో భళే విచిత్రమైన organic nature and stature తో రంగరించారు. That was phenomenal for me! ఈ కథ రాసింది మా ఊరు సిరిసిల్లకి దగ్గర్లో ఉన్న వ్యక్తేనా అని నా హృదయానికి ఆ పుస్తకాన్ని ఎంతో ప్రేమతో హత్తుకున్న సందర్భం అది. ఆశ్చర్యాల, ఆనందాల సమ్మేళనమది! కథ ముగింపులో అయితే నా కళ్ళల్లోకి నీళ్లు అచేతనంగా ఒక్కదెబ్బకి దూకాయి. చాలా అంటే చాలా నచ్చింది.
నా నాలుక మీద తేలియాడే యాస ఈ కథల్లో ఉన్న సంభాషణల రూపాల్లో కదులుతూ ఉంటే ఎంతో ముచ్చటేసింది, ఇంకెంతో మురిసిపోయా నాలో నేనే. ఇది నా యాస, నా భాష, నా నాలుక మీద నానే అక్షారాలవి అనే ఆలోచనల్తో.
'మెడిటేషన్' కథలో అయితే ఇంచుమించు రచయిత ఆలోచనల గొలుసుల తాలూక ఈ మనుష్య ప్రపంచం పట్ల ఉన్న ఆవేదన, ఆవేశం, గౌరవం, ఆశ్చర్యం, మిస్టిసిజం అన్నీ తన లోపల మండే నిప్పురవ్వల నుండి పుట్టిన అక్షరాల్లాగా తోచింది నాకయితే. పెల్లుబికిన లావా అది. Kudos!
అప్పుడప్పుడూ అమితమైన details ఉంటే character దృక్పథంలో కాకుండా రచయిత తాలూక binoculars ధరించి చూడవలసిన forced viewing తటస్తించే సందర్భం ఏర్పడవచ్చు. ఈ కథల పుస్తకంలో, తన రచనల్లో ఇదొక్కటే నాకు ఎందుకో నచ్చని విషయం, తాపుకోసారి నన్ను suffocate చేసిన ముచ్చట. అలా అనీ పక్కన పెట్టనూలేము! అదే తన గొప్పతనం.
తప్పకుండా చదవవలసిన రచనలవి. సూక్ష్మంలో కూడా సృష్టి రహస్యాన్ని మీ చెవిలో చెప్పడానికి పూనుకున్న రాజిరెడ్డి గారికి ఇదే నా whispering of the heart.. 'ఈ సృష్టిలో మీరు రచయిత అవ్వడం ఒక subtle, surrealistic beauty'.
మీరు రాస్తూ ఉండాలి ఎప్పటికీ!
ఈ కథల పుస్తకాన్ని రచయిత ఎంతో ఇష్టంగా మెహెర్ బ్రదర్ కి ఇచ్చిన మొదటి పేజీలో తనే స్వయంగా రాసిన 'మ్యాజికల్ మెహెర్ కు, ఆత్మీయంగా' అనే పదాల కింద తన సంతకం ఉంటుంది. ఇది గుర్తుచేసుకుంటూ అంతే ఆత్మీయంగా నా ఆత్మబంధువైన మెహర్ బ్రదర్ కి ఈ పుస్తకాన్ని చదవమని నాకు ఇచ్చినందుకు, నా ఊరోడ్ని నాకే పరిచయం జేశ్నందుకు, మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ..
- సత్య తేజ్

Sunday, April 7, 2024

ఫార్‌స్టర్‌ ఇండియా ప్రయాణం


ఇండియా ప్రయాణం

భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్‌ రాజ్‌ అనుభవాలతో ఇ.ఎం.ఫార్‌స్టర్‌ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్‌ సీనియర్‌లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్‌ పవార్‌ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్‌స్టర్‌ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్‌మన్‌ కవితా సంకలనం ‘పాసేజ్‌ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్‌స్టర్‌ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్‌లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్‌ లీన్‌. ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం.


నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్దమనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్‌ అజీజ్‌. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్‌ ఫీల్డింగ్‌. అజీజ్‌ తబ్బిబ్బయిపోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్‌. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్‌ పట్టణానికి వచ్చిన మిసెస్‌ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్‌’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్‌. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్‌ అయిన మూర్‌ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్‌ మూర్‌ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్‌ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్‌ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి!


కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమైపోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్‌. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్‌మన్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు.


‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్‌స్టర్‌ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్‌స్టర్‌ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్‌ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్‌ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్‌స్టర్‌ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది!

(సాక్షి ఎడిటోరియల్‌ పేజీ; ఏప్రిల్‌ 1,2024)

 






Tuesday, April 2, 2024

'ఆంధ్రజ్యోతి'లో 'గంగరాజం బిడ్డ' సమీక్ష


గంగరాజం బిడ్డ


బహుముఖ విన్యాసాల కదంబం

కల్పనకు, వాస్తవానికి మధ్య ఉన్న పొరను ఒలిచేస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి, వాక్యాన్ని భావగర్భితంగా నిర్మించే వీరి రెండో కథా సంపుటి 'గంగరాజం బిడ్డ'. 12 కథల ఈ సంపుటిలో మనిషి మానసిక విన్యాసాలతోపాటు, భౌతిక పరిస్థితుల ప్రభావిత చర్యలు, అనేకానేక పరిమితుల్లో చర్య, ప్రతిచర్యల క్రియలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, వాతావరణ పరికల్పన, అద్భుత పాత్రచిత్రణలతో కనిపిస్తాయి. 'బోర్లించిన చెప్పు'లో గతంలోని ఆవేశపు మాటల్ని వదులుచేసే వర్తమాన సన్నివేశం కలిగించే హాయి ఉంది. 'గంగరాజం బిడ్డ'లో తండ్రి చేసిన తప్పులకు బిడ్డకు ఎందుకు శిక్షపడాలని ఓ అవ్వచేసే తిరుగుబాటు అబ్బురపరుస్తుంది. 'మెడిటేషన్' కథ సంకల్పిత, అసంకల్పితాల్లోంచి పుట్టిన మనో నిర్మిత చైతన్యస్రవంతి, తాత్విక సిద్ధాంతాల పోరును వెల్లడిస్తుంది. 'జీవగంజి' వాస్తవాన్ని సత్యమని స్వీకరించడమే ఉత్తమమని అన్నం మెతుకు సాక్షిగా బోధిస్తుంది. 'చిలుము' స్వప్నంలా రాలిపోయిన ప్రేమతో పాటు, ప్రాంతం, మతం, భాషల ఆధిపత్య భావజాలాన్ని బలంగా చూపిస్తుంది. జ్ఞాపకాల పొత్తిళ్లలోకి కథనాత్మకంగా జారిపోయే ఈ రచయిత, కళ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం అని నమ్మి, మిగిలిన కథల్లోనూ అదే విష యాన్ని నిరూపించాడు. నిజంగా, ఇవి పెనుగులాటలోంచి పుట్టిన మేలైన కథలు.

- ప్రణ

గంగరాజం బిడ్డ మరిన్ని కథలు, రచన: పూడూరి రాజిరెడ్డి

పేజీలు: 114, వెల: రూ.150, ప్రతులకు: 99124 60268 మరియు 'అమెజాన్' 

(24-3-2024; ఆంధ్రజ్యోతి ఆదివారం )

Monday, April 1, 2024

సాక్షి- పుస్తక పరామర్శ - గంగరాజం బిడ్డ



రాజిల్లే జీవన తాత్త్వికత


సీనియర్ జర్నలిస్ట్, రచయిత పూడూరి రాజిరెడ్డి ఏడేళ్ల 'కలం’కారీ తనం కలబోసుకుని 'గంగరాజం బిడ్డ'గా మన ముందుకు వచ్చింది. పన్నెండు కథల ఈ సంపుటి రచయిత గత
కథలకు భిన్నమైనది. ఇందులోని కథలలో సగం ఒక విధమైన మోహపరవశంతో కూడినవి కాగా మరో సగం కథలు 'రెండోభాగం', 'మెడిటేషన్', 'ఎడ్డి, 'జీవగంజి' 'కొండ', 'ఎఱుక' కథలు ఒకవిధమైన జీవన తాత్త్వికతను చెబుతాయి. వీటన్నింటిలోనూ బాల్యం నుంచి టీనేజీ, పెళ్లీడు, ఆ తర్వాత, మధ్య వయసు... ఇలా అన్ని దశలలోనూ పురుషుడే తనలో ముప్పిరిగొనే అనేక భావాలను వ్యక్తం చేస్తూ పోతాడు. ఆయా పాత్రల ఆలోచనాధారలో 'ఇదంతా నా గురించేనేమో' అని చదువరులు అనుభూతి చెందేలా చేసే రచనా చాతుర్యం అబ్బుర పరుస్తుంది. అచ్చమైన తెలంగాణ మాండలికంతో కొసంటా చదివింపజేసే ఈ కథలలో కొన్ని పదాలకు అర్థాలు తెలియకున్నా, కథాగమనానికి భంగం వాటిల్లదు. 

గంగరాజం బిడ్డ, మరిన్ని కథలు
రచన: పూడూరి రాజిరెడ్డి, ఫోన్: ---
పుటలు:116; వెల రూ. 150
ప్రతులకు: సేపియన్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్,
1-3-63/2, మల్బౌలి స్ట్రీట్, నల్గొండ-
508001. 9912460268; 
పుస్తక విక్రయ కేంద్రాలు

-DVR

(03/03/2024 | ఫన్‌డే) 

Sunday, March 17, 2024

తమిళంలోకి ‘ఎడ్ది’







 

నా 'ఎడ్డి' కథ తమిళ అనువాదం కాలచువాడు మాసపత్రిక మార్చి 2024 సంచికలో ప్రచురితమైంది. అనువాదకులు మారియప్పన్‌ గారికీ, సంపాదకులకూ ధన్యవాదాలు.